Wednesday, 28 November 2012

Kedara Vrat katha in Telugu

kedareshwara vratham Story in Telugu

సూతపౌరాణీకుడు శౌనకాది మాహర్షుల గాంచి ఇట్లనియె, ఋషిపుంగవులారా! మానవులకు సర్వసౌభాగ్యంబుల గలుగజేయునదియు, పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్థము పొందబడినదియునగు కేదారీశ్వర వ్రతం బనునొక వ్రతంబు గలదు. ఆ వ్రత విధానంబును వివరించెదను వినుండు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులాచరింపవచ్చును. ఈ వ్రతము నిరువదియొక్కమారు లాచరించు పుణ్యాత్ములు సకలసంపద లనుభవించి, పిదప జీవసాయుజ్యంబు నొందుదురు. ఓ ఋషి శ్రేష్ఠులారా ! ఈ వ్రత మాహాత్మ్యంబును వివరించెద వినుండు, భూలోకమునందీశాన్యభాగంబున మెరుపుగుంపులుతో గూడి యున్నను గిరిత్కాల మేఘములుంబోలుచు నిఖిలమణి నిర్మితంబైన శిఖరముల చేతను, పలురంగులైన లతావిశేషములచేతను, బహువిదంబులగు పుష్పఫలాదులచేతను, నానావిధములైన పక్షుల చేతను మరియు ననేకంబులైన కొండ కాలువల చేతను వ్యాప్తంబై తాల తమాల రసాల హింతాల వకుళాశోకచందన దేవదారు నారికేళామ్రపనసనాగపున్నాగ చంపకాదివృక్షముల చేతను నదియును గాక నానాతరు విశేషముల చేత భాసిల్లునట్టి ఉద్యానవనముల చేత బ్రకాశించుచూ నిఖిల కళ్యాణ ప్రదంబులై సర్వజన నమస్కృతంబై కైలాసం అని పేర్కొనబడియొక పర్వతశ్రేష్టము గలదు. అందు సద్గుణైశ్వర్యసంపన్నులగు మహనీయులగు యోగులచేతను, సిద్ధ, గంధర్వ, కిన్నెర కింపురుషాదుల చేతను సేవింపబడి మనోహరంబయియున్న యా పర్వత శిఖరమందు జగత్కర్త అయిన పరమేశ్వరుడు ప్రథమగణములచే బరివేష్ఠింపబడి, భవానీ సమేతుడై సకల దేవముని బృందముల చేత నమస్కరింపబడుచుండి, ప్రసన్నుడై కూర్చుండియున్న యొక సమయంబున చతుర్ముఖాది సురలందరికి దర్శనమిచ్చె. అంత సూర్యాగ్ని పవనులు, నక్షత్రయుక్తుండైన నిశాకరుండును మఱియు ఇంద్రాదిదేవతలును వశిష్ఠాది మహర్షులును, రంభా మొదలగు దేవతా స్త్రీలును, బ్రాహ్మీ మొదలగు సప్తమాతృకలను,సేనానియు, గణపతియును, తత్సామీప్యంబును బొందియున్న నంది, భృంగి మొదలగు ప్రమధ గణములు తమను పరివేష్టించి కొలుచుచున్నట్టి భవానీ వల్లభుని యత్యద్భుతమంబగు ఆ సభయందు నారదుడు మొదలగు దేవగాయకులా స్వామి యనుజ్ఞ వడసి గానము జేసిరి. రమణీయంబయి శ్రావ్యంబగు వ్యాదలయలతో గూడి నృత్యమొనర్చిరి. అప్పుడా వేల్పు బానిసెల లోపల మిగుల సొగసుకత్తెయగు రంభ నిఖిల సురబృందముల యొక్క యల్లములు రంజిల్లునటుల నాట్యమొనరించె, ఆ సమయంబున భృంగిరిటి భక్తవరుండా స్వామి సన్నిధియందు తత్ వ్యతిరేకముగా వికట నాట్యము చేయగా నా పార్వతి కైలాసాధిపతియొక్క పూర్వభాగమునందుండెను. అప్పుడు సకల దేవతలకు మిక్కుటమైన హాసముజనించె. అట్టి యాశ్చక్యకరంబగు హాసమువలన నప్పుడా పర్వతగుహలు నిండునటుల గొప్ప కలకలధ్వనికలిగె, ఇట్లు హాసము విస్తరిల్లుచుండ సర్వేశ్వరుండగు శంకరుడా భృంగిరిటిని జూచి, నీచేత మిగలు హర్ష ప్రవృద్ధంబైన నాట్యము చేయబడెనని మెచ్చి మదంబంది యా భక్తుని యనుగ్రహించె. అంతట నా భృంగిరిటికి శివానుగ్రహంబు కలుగటంజేసి ప్రీతుండై సకల విధులచేత గౌరవింపబడి, సమాహితచిత్తుడై వినయముతో గూడి యా పార్వతీదేవిని వదలి యీశ్వరునికి మాత్రము ప్రదక్షిణమొనర్చి యాస్వామికి వందన మాచరించె. అప్పుడు పూజ్యురాలగు మృడానియు చిరునవ్వుతో గూడినదై తన భర్తయగు నప్పరమేశ్వరుని వీక్షించి ఓ స్వామీ ! ఈ భృగిరిటి నన్ను విడిచి మీకు మాత్రము ప్రదక్షిణం బాచరించుటకు గారణంబేమి? వినవేడుకైయున్నది? ఆనతీయవో యని వేడగా, నా శశిశేఖరుండు ఓ ప్రియురాలా ! చెప్పెద వినుము.

పరమార్థవిదులగు యోగులకు నీవలన ప్రయోజనంబులేమింజేసి నాకు నమస్కరించెనని సెలవివ్వగా నా పరమేశ్వరి మిగుల వ్రీడనుబొంది ఆ భర్తయందున్న తన శక్తి నాకర్షించగా స్వామి త్వగస్థి విశిష్టామాత్రానయవుండాయె. అంతట నాదేవియు సారహీనురాలై వికుటరాలయ్యె, పిదప నాదేవి కోపించి దేవతల చేత నూనడింపబడినదై కైలాసమును వదలి తపంబొనరించుటకు బహువిధములగు సింహ, శరభ, శార్దూల, గజ, మృగాదులచేత సేవింపబడియు నిత్య వైరంబుడిగియున్న పన్నగ గరుడాది సకల జంతువులచేత నిబిడంబగు నానావిధ వృక్ష, లతా, గుల్మాది భూయిష్టంబై ఋషి శ్రేష్ఠ సేవితంబై సర్వాభీష్ఠ ప్రదంబై యున్న గౌతమాశ్రమమున బ్రవేశించె. అంత నా గౌతముండు వన్యంబులైన హోమయోగ్యంబులగు సమిత్కుశ ఫలాదులను గ్రహించుకొని వనంబునుండి వచ్చునెడ తన ఆశ్రమ భాగమున వెలుగుచున్న ప్రకాశమును జూచి ఋష్యాశ్రమంబగు నిది మిగుల శోభిల్లుచున్న రేకులవంటి కన్నులు గలిగి యలంకృతరాలైయున్న యామహేశ్వరింగనుకొని పూజ్యురాలవైన ఓ భగవతీ ! నీవిచటకేతెంచుటకు కారణంబేమి? అని యడుగ నద్దేవియు నాజడధారికి తన విషాదకరమును వచించి నమస్కరించుచు ఓయీ ! మునీశ్వరుడా ! యే వ్రతము యోగ సమ్మతంబైనదో ఏ వ్రతానుష్టానము చేత శంకర దేహార్థము నాకు ఘటించునో యట్టి వ్రతము ఉపదేశిపుము మనగా ఆ మహర్షి సకల శాస్త్ర పురాణావలోకనంబాచరించి యీప్సితార్థప్రదంబగు శ్రీమత్కేదారనామకంబైన ఉత్తమ వ్రతము నాచరింపుమని ఉపదేశింపగా నంత నాదేవియు నావ్రతానుష్ఠాన క్రమంబానతీయుమని వేడగానిట్లు చెప్పదొడంగె. భాద్రపద శుక్లమునందు శుద్ద మనస్సురాలవై మంగళకరంబులగు నేకవింశతి తంతువులె చేత హస్తమునందు ప్రతిసరమును దరించి యాదినమందు ఉపవాస మొనరించి, మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి, అది మొదలు అమావాస్య వరకు నీవ్రతము నిట్లు సలుపుచు ప్రతిదినమునందును శ్రీమత్కేదార దేవునారాధింపవలెను. మరియు శుద్ధంబగు నొక్క ప్రదేశంబున దాన్యరాశియందు పూర్ణకుంభముంచి యిరువది యొక్క సూత్రములచే జుట్టి పుట్టుపుట్టముల చేత కప్పియుంచి నవరత్నములునుగాని, శక్తి కొలది సువర్ణముగాని యుంచి, గంధపుష్పాక్షతలచే నర్చించి యిరువది యొక్కరైన బ్రాహ్మణులను బిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యంబులాచరించి కూర్చుండ నియోగించి యచ్చట నాకేదారదేవుని ప్రతిష్టింపజేసి, చందనాగరు కస్తూరీ కుంకుమాదులను శ్రీగంధమును నానావిధ పుష్పములను, తాంబూలమును, వస్త్రముల నుంచి నివేదన మొనరించి యథా శాస్త్రముగ ధూపదీపాదులచేత బూజించి యేకవింశతి సంఖ్యాకులైన భక్ష్యభోజ్యచోష్యలేహ్యాదులను కదళీఫలములను నైవేద్యంబుజేసి తాంబూలము లొసంగి, చక్కగా స్తోత్రము జేసి బ్రాహ్మణులకు యధాశక్తి దక్షిణలిచ్చి, వ్రతమును లెస్సగా ననుష్ఠించి, ఈశ్వరునకు మనస్సంతుష్ఠి చేసిన యెడల ప్రీతుండై యావృషభద్వజుండు నీవు కోరిన వరంబియ్యగలడు అని వచించిన నా కాత్యాయనియునట్లే యగును గాక ! యని యాచరించె. అంత పరమశివుండు సంతుష్ఠాతరంగుడయి , యిచ్చటికి దేవగుణంబులతోడ వచ్చి నిజశరీరార్థము నీకిచ్చెదననగా పార్వతి యుప్పొంగి శంకర దేహార్థమునండి లోకానుగ్రహము చేయదలచి తన భర్తయగు నీశ్వరునితో నీ వ్రతంబాచరించిన వారలకు సకలాభీష్టసిద్ది గలుగునటుల యనుగ్రహించితిరేని యెల్లవారు నాచరింతురనగా నట్లే యగుగాక! యని యంగీకరించి సురసంఘములతో గూడ నంతర్హితుండయ్యె. మరికొంత కాలమునకు శివభక్తి యక్తుండగు చిత్రాంగదుడను గంధర్వుండు నంది కేశ్వరునివలన నా వ్రతక్రమంబెఱిగి మనుష్య లోకమునకుంజని వారల కుపదేశింప వలయునను నిచ్ఛగలవాడై యుజ్జయనీ పట్టణమునకు బోయి వజ్రదంతుడను రాజున కుపదేశింప నతడు ఆ వ్రతమును గల్పోక్త ప్రకారంబుగా నాచరించి సార్వభౌముండాయెను.

మరికొంత కాలమునకు నా పట్టణంబుననున్న వైశ్యునకు బుణ్యవతియనియు, భాగ్యవతియనియు, నిద్దరు కుమార్తెలు గలిగిరి. వారిద్దరును తండ్రియొద్దకుబోయి కేదారవ్రత మాచరించునట్లాజ్ఞ యొసంగుమని వేడగా నేనుమిగులరిక్తుండను. దానికీవలయుసామాగ్రి లేమింజేసి మీ సంకల్పంబు మాను డనగా ఓ తండ్రీ ! నీ యాజ్ఞ మాకు పరమదన్యంబు గాన నాజ్ఞయొసగు మని సెలవు పుచ్చుకొని బాదరించుట వటవృక్షమూలంబున కూర్చుండి ప్రతిరసము గట్టుకొని యధావిధిగా పూజింప వారల భక్తికిమెచ్చి యీశ్వరుడు అప్పుడు వలయుసామాగ్రినిచ్చెను.

అంతట వారలు చక్కగా వ్రతం బాచరించుటవలన నమ్మహాదేవుడు ప్రీతుండై యక్కన్యల కాయురారోగైశ్వర్యములును దివ్యరూపంబుల ఒసంగి యంతర్హితుడయ్యెను. పిమ్మట నావ్రతమాహాత్మ్యము వలన నుజ్జయనీ పట్టణమేలుచున్న రాజు పుణ్యవతియును కన్యను చోళభూపాలుడు భాగ్యవతియును కన్యను పాణీగ్రహ మొనర్చినందువలన నావైశ్యుండు ధనసమృద్ధుండై సామ్రాజ్య సంపదలను, పుత్రులను బొంది సుఖంబున నుండ నంత వారిలో రెండవదియైన భాగ్యవతియనునది యైశ్వర్యమదమోహితురాలై కొంతకాలమునకు నా వ్రతమును విడిచెను. అందువలన భాగ్యహీనురాలై పెనిమిటి చేత వెడలింపబడి పుత్రునితోడ యడవిని తిరిగి సంచారఖిన్నురాలై ఒక బోయవాని యిల్లుచేరి, ఇచ్చట తన బుత్రుని జూపి యోపుత్రా! యక్కయగు పుణ్యవతిని యుజ్జయనీ పట్టణరాజు వివాహమాడియున్నాడు. నీవచ్చటికి జని దానింజూచి ధనము తీసుకొని శీఘ్రముగా రమ్మనగా నతండా పట్టణమునకు బోయి పెద్దతల్లికి తనయొక్క దుస్సహంబగు కష్టమును దెలపగా నా పుణ్యవతియును సుతునకు విస్తారముగా దనమునిచ్చె, అంతనంతండా ధనమును దీసుకొనివచ్చునెడల మార్గంబున నదృశ్యరూపుండైన యద్దేవునివలన నాధనము నపహరింపబడగా దోదూయమాన మానసుండై నిలువబడియున్న వానితో నీశ్వరుండదృశ్యుండై యో చిన్నవాడా ! వ్రతభ్రష్ఠుల కీధనము గ్రహించనలవిగాదని చెప్పగా నావాక్యము విని విస్మయంబంది యా చిన్నవాడు మరల పూర్వమువలె నచటికింజని యీశ్వరోక్తంబగు వృత్తాంతమును దెలుపగా నా పుణ్యవతి యాలోచించి పుత్రుని వ్రతం బొనర్రింపజేసి తన చెల్లెలు వ్రతమాచరించునటుల చెప్పవలయునని ద్రవ్యము నొసంగి పంపగా నతండు బయలు వెడలి వచ్చునెడ మార్గంబున నప్రయత్నంబుగ పూర్వము గొనిపోయిన ధనమంతయు స్వవశమైనందున సంతసించి, సర్వము గ్రహించుకొని కాంచీపట్టణమును ప్రవేశించి సమయంబునకు జనియె . అంతట తల్లిదండ్రులతో గూడి సుఖముల ననుభవించుచుండె. పిమ్మట తల్లియగు భాగ్యవతియును తండ్రియగు చోళరాజును నదిమొదలు ఈ వ్రతము నాచరించుచు ఈ అవిచ్చిన్నంబగు నిఖిల సంపదల ననుభవించుచుండిరి, కావున యెవ్వరైనను యదోక్త ప్రకారము నీ వ్రత మహత్మ్యమును భక్తియుక్తులైన వినిన, చదివిన నట్టి వారందరును, శ్రీ మహాదేవుని యనుగ్రహము వలన ననంతంబులగు నాయురారోగ్య ఐశ్వర్యములను బొంది సుఖంబు లనుభవించి శివసాయుజ్యమును బొందుదురని గౌతమ మహర్షిచే చెప్పబడెనని సూతుండు శౌనుకాదులకు చెప్పగా శ్రీ వ్యాసభట్టారsకుడు స్కాంద పురాణమునం దభివర్ణించెను.
కేదారేశ్వర వ్రతకథ సంపూర్ణము.

No comments:

Post a Comment